నల్లారి కుటుంబంలో రాజకీయం రసవత్తరంగా  మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు


చిత్తూరు: నల్లారి కుటుంబంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు పీలేరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా.... తాను మాత్రం టీడీపీ అభ్యర్ధిగానే పీలేరు నుండి బరిలోకి దిగుతానని కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందే ఆయన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి తనయుడితో కలిసి టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను కూడ కేటాయించారు.

అయితే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ గత నెలలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కిరణ్‌కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టాలనే ఉద్దేశ్యంతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు. ఇందులో భాగంగానే కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలో చేర్చుకొన్నారు. 

2019 ఎన్నికల్లో కిషో‌ర్‌కుమార్ రెడ్డిని పీలేరు స్థానం నుండి బరిలోకి టీడీపీ దింపనుంది. అయితే గతంలో ఈ స్థానం నుండి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఒకవేళ ఈ స్థానం నుండి సోదరుడు కిరణ్‌కుమార్ రెడ్డి బరిలోకి దిగినా తాను కూడ టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉంటానని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.

కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో జిల్లా రాజకీయాల్లో కిషోర్ కుమార్ రెడ్డి చక్రం తిప్పారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకర్గాల్లో కిషోర్ కుమార్ రెడ్డికి మంచి పట్టుంది. అయితే ఈ కారణంగా చంద్రబాబునాయుడు కిషోర్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కిరణ్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేవు. అయితే గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత మెరగయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ఈ రకమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కూడ ఏపీలో బలం లేదు. అయితే ఇతర రాష్ట్రాల నుండి కిరణ్‌కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపే అవకాశాలు లేకపోలేదని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

రాహుల్ టీమ్‌లో కిరణ్‌కుమార్ రెడ్డికి మంచి పదవి దక్కే అవకాశం లేకపోలేదని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అనివార్య పరిస్థితులు నెలకొంటే తప్పా... కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చని ఆయన అనుచరులు అభిప్రాయంతో ఉన్నారు.

ఈ వార్త చదవండి

కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్ రెడ్డి: తమ్ముడేం చేస్తారు?