అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. తమ మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదని తెలిపారు. లోక్ సభ విప్ పదవిని విజయవాడ ఎంపీ కేశినేని నాని తిరస్కరించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అలజడి నెలకొంది. 

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ అధినేత చంద్రబాబు కేశినేని నాని, గల్లా జయదేవ్ లతో కలిసి సమావేశం నిర్వహించారు. సుమారు గంటపాటు ఇద్దరు ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గల్లా జయదేవ్ సమావేశంలో తనకు ఎలాంటి పదవులు వద్దని కేశినేని నాని చెప్పినట్లు స్పష్టం చేశారు. 

తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. పార్లమెంటరీ నేతగా తనకు అవకాశం ఇవ్వడంపై కేశినేని నానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారని తెలిపారు. ఇకపోతే తాను గతంలోనే పార్లమెంట్ లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 

అయితే ఈసారి తనకు పార్లమెంటరీ నేతగా అవకాశం చంద్రబాబు కల్పించారని తెలిపారు. అలాగే తన తల్లి గల్లా అరుణకుమారికి రాజకీయాల్లో 30 ఏళ్ల అనుభవం ఉందని ఆమె యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. 

ఆమె సూచనలు, సలహాలు అవసరమని భావించారు కాబట్టే టీడీపీ పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారని తెలిపారు. అవసరమైతే పార్లమెంటరీ నేతగా చంద్రబాబు నాయుడు వేరే ఆలోచన చేసినా అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటరీ నేతగా తాను ఉండాలనుకోవడం లేదని చంద్రబాబు నాయుడు అప్పగించారు కాబట్టే అంగీకరించానని స్పష్టం చేశారు గల్లా జయదేవ్

ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురుమే ఎంపీలుగా గెలిచామని ముగ్గురం కూడా రెండోసారి గెలిచామని తెలిపారు. తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవన్నారు. భవిష్యత్ లో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం బట్టే తామంతా నడుకుంటామని స్పష్టం చేశారు.