హైదరాబాద్-విజయవాడ హైవే క్లియర్.. తగ్గుముఖం పట్టిన మున్నేరు..
మున్నేరు వాగు వరదనీరు తగ్గుముఖం పట్టింది. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవే మీద రాకపోకలు పునరుద్ధరించారు. శనివారం యధావిధిగా రాకపోకలు సాగుతున్నాయి.
ఐతవరం : తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు దంచి కొట్టాయి. దీంతో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ వరదల కారణంగా కృష్ణా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారి మీదికి నీరు భారీగా చేరింది. వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మీద దాదాపు 24 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
వేలాది వాహనాలకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. టీఎస్ఆర్టీసీ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్-విజయవాడల మధ్య రెగ్యులర్ గా నడుపుతున్న సర్వీసులను రద్దు చేసింది. 24 గంటల తర్వాత ఈ దారిని పునరుద్ధరించారు. తిరిగి వాహనాల రాకపోకలు తాజాగా ప్రారంభమయ్యాయి.
పోటెత్తిన మున్నేరు వరద, హైద్రాబాద్-విజయవాడ హైవే రేపటి వరకు మూసివేత: సీపీ కాంతిరాణా టాటా
హైదరాబాద్-విజయవాడ హైవే మీద యధావిధిగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మున్నేరు వాగు శాంతించడంతో.. వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించారు. వాహనాలు నిలిచిపోయిన సమయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సహాయక చర్యలో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాల సహాయంతో రక్షించారు.