ఎనిమిది నెలల గర్భిణి భార్యతో కలిసి భర్త ఆత్మహత్య చేసుకున్న విషాదం వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. 

కడప : నిండు గర్భిణి భార్యతో కలిసి భర్త ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

దంపతుల ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప పట్టణంలోని విజయదుర్గా కాలనీలో సాయికుమార్ రెడ్డి, హేమమాలిని దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహం కాగా ప్రస్తుతం హేమ గర్భంతో వుంది. సాయికుమార్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే వ్యాపారం సరిగ్గా సాగక తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదురవడంతో ఇబ్బందిపడ్డ దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. 

Read More బ్యూటీ పార్లర్ మర్డర్ : యువతి గొంతు కోసి.. తానూ కోసుకున్న యువకుడు.. మిస్టరీగా కారణాలు...

మంగళవారం రాత్రి కడప శివారులోని రైల్వే ట్రాక్ పైకి వెళ్లిన సాయి, హేమ దంపతులు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం రైలు పట్టాలపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. 

నిండు గర్భంతో వున్న భార్య హేమతో సహా భర్త సాయి సూసైడ్ చేసుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్ని కష్టాలు ఎదురయినా వాటితో పోరాడాలని... ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని చెబుతున్నారు. ధైర్యంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనివుంటే హేమ, సాయి దంపతులు పుట్టే బిడ్డతో హాయిగా వుండేవారు... క్షణికావేశంలో వారు దారుణ నిర్ణయం తీసుకున్నారు. 

(ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు)