భార్య తనను నిలదీసిందన్న కోపంలో ఓ భర్త కట్టుకున్న భార్యను నరికి చంపాడు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ల మండలం తమ్మేపల్లి గ్రామానికి చెందిన గంగాధర, అక్కమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో  గంగాధర గత వారం రోజులుగా పనికి వెళ్లకుడా ఇంట్లోనే ఉంటూ తాగుతూ.. తూలుతూ ఉన్నాడు.. భార్య ఇదేమి పట్టించుకోకుండా తాను మాత్రం కూలికి వెళ్లేది.

ఈ క్రమంలో నిన్న సాయంత్రం కూలి పనికి వెళ్లొచ్చిన అక్కమ్మ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది... ఆ సమయంలో గుమ్మం పక్కన తాగుతూ కూర్చొన్న భర్తను చూసి.. కోపంగా ఇట్లా ఇంట్లో కూర్చొని తాగుతూ ఉంటే బ్రతకడమెట్లా అంటూ గట్టిగా నిలదీసింది. భార్య తననే నిలదీసిందనే అక్కసుతో గంగాధర పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకుని తలపైన, మెడపైనా విచక్షణారహితంగా నరికాడు. దీంతో ఆమె అక్కడే రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది..

వెంటనే భార్య చనిపోయిందని అరుచుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. హత్య జరిగిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గంగాధరను అదుపులోకి తీసుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.