ఏలూరు: ప్రియుడితో కలిసి పోలీసు స్టేషన్ కు బయలుదేరిన భార్యను ఆమె భర్త నడిరోడ్డుపై నరికి చంపాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం రోడడుపై జరిగింది. భర్తతో తెగదెంపులు చేసుకునేందుకు ఆమె పోలీసు స్టేషన్ కు బయలుదేరింది. ఆ సమయంలో కాపు కాసి భర్త ఆమెను హత్య చేశాడు. 

గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన బేతిన చంద్రిక (24) అదే మండలం చిలకంపాడుకు చెందిన దువ్వారపు చంటి 2014లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. స్థలం కొనుక్కోవడానికి చంద్రిక తల్లిదండ్రులు రూ.4 లక్షలు చంటికి ఇచ్చారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో ఆరు నెలల నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. 

ఆ క్రమంలోనే ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చెందిన కొమ్ము జెల్సీతో చంద్రికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమె జెల్సీతో కలిసి ఉంటోంది. భర్తపై గణపవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి విడాకులు తీసుకునేందుకు గొల్లగూడెం నుంచి మొయ్యేరుకు ప్రయుడితో టూ వీలర్ మీద బయలదేరింది. 

ఆ సమాచారం అందుకున్న భర్త చంటి వారు ప్రయాణిస్తున్న పెంటపాడు, జట్లపాలెం మార్గంలో మరో ఇద్దరితో కలిసి మాటు వేశాడు. భార్య, ఆమె ప్రియుడు కనిపించగానే మాట్లాడే విషయం ఉందని వారిని ఆపాడు. చంటి తొలుత భార్య ప్రియుడు జెల్సీపై దాడి చేశాడు. అతను తప్పించుకుని పెంటపాడు పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. తర్వాత చంద్రికపై చంటి దాడి చేసి కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.