ఒంగోలు: అనుమానంతో భార్యను సంక్రాంతి పండుగ రోజునే భర్త హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.  ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.   మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కంభం రోడ్డులో ఎన్. శరభయ్య తన భార్య పార్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు   ఇద్దరు పిల్లలున్నారు.  పార్వతి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో  టీచర్‌గా పనిచేస్తోంది. శరభయ్య  ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. 

భార్య పార్వతిపై శరభయ్య అనుమానం పెంచుకొన్నాడు.ఈ విషయమై  ప్రతి రోజూ భార్య, భర్తల మధ్య గొడవలు సాగుతుండేవి.  ఈ కారణాన్ని సాకుగా చూపి శరభయ్య మద్యానికి బానిసగా మారాడు.   మద్యం తాగొచ్చి భార్యను వేధింపులకు గురి చేసేవాడు. 

అయితే ఈ విషయం తెలిసిన పార్వతి  తల్లిదండ్రులు శరభయ్యకు నచ్చజెప్పారు. అయితే ఈ నెల 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు  భార్య, భర్తల మధ్య మరోసారి గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవ కారణంగా ఆగ్రహాంతో శరభయ్య భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు.

దీంతో పార్వతి అక్కడికక్కడే మరణించింది., ఈ విషయం తెలిసిన పార్వతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శరభయ్య కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.