విజయనగరం: భార్య మరణించిన కొద్ది గంటల్లోనే భర్త మరణించిన ఘటన  విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలోని పందిరప్పన్న కూడలిలో మనోహర్, సూర్య ప్రభావతి దంపతులు నివాసం ఉంటున్నారు. 

శనివారం నాడు రాత్రి సూర్య ప్రభావతికి గుండెపోటు వచ్చింది. ఈ గుండెపోటు రావడంతో  ఆయన 108 సిబ్బందికి ఫోన్ చేశాడు.  ఈ ఫోన్ వచ్చిన వెంటనే  108 సిబ్బంది  సూర్యప్రభావతిని పరీక్షించారు. ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది ఆమె మరణించిందని చెప్పారు.

అయితే ఈ విషయాన్ని బంధువులకు చెప్పేందుకు ఫోన్ తీసి కుప్పకూలిపోయాడు.  వెంటనే అక్కడే ఉన్న  108 సిబ్బంది అతడిని పరీక్షించారు.  ఆయన కూడ మరణించినట్టుగా వైద్య సిబ్బంది ప్రకటించారు.

క్షణాల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భార్య మరణించిన విషయం తెలుసుకొన్న భర్త మనోహర్ కు కూడ గుండెపోటు వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.

మనోహర్ ఎల్ఐసీలో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కొడుకు డిగ్రీ పూర్తి చేశాడు.