భార్యను అమితంగా ప్రేమించే  ఓ భర్త.. ఆమె అర్థాంతరంగా తనువు చాలించడంతో తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం తనకొద్దని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

భార్యను అమితంగా ప్రేమించే ఓ భర్త.. ఆమె అర్థాంతరంగా తనువు చాలించడంతో తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం తనకొద్దని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన రాజేశ్ విదేశాల్లో కూలిగా పనిచేస్తుండేవాడు.

కరోనా నేపథ్యంలో అతను స్వగ్రామానికి వచ్చేశాడు. ఈ ఏడాది జూన్ 12న ఇచ్చాపురానికి చెందిన జయతో రాజేశ్ వివాహం జరిగింది. ప్రస్తుతం జయ గర్బిణీ.. ఈ క్రమంలో ఆమెకు ఆదివారం కడుపులో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఇచ్చాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

అయితే అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటీన బరంపురంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా ఫిట్స్‌ రావడంతో జయ కన్నుమూసింది.

మృతదేహాన్ని కొఠారీ గ్రామానికి సోమవారం తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త రాజేష్‌ జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన అతను మంగళవారం టిఫిన్ చేసి వస్తానంటూ బైక్‌పై ఇచ్చాపురం 16వ నెంబర్ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు.

ఇచ్ఛాపురం–ఈదుపురం క్రాస్‌ రోడ్డు పక్కనే తన వాహనాన్ని ఉంచి డివైడర్‌పై కూర్చొని వేదనకు గురయ్యాడు. బరంపురం నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడకక్కడే మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాజేశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోజుల వ్యవధిలో కోడలిని, కొడుకుని పొగొట్టుకున్న రాజేశ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.