భార్య అనారోగ్యం కారణంగా మృత్యువుతో పోరాడుతుంటే.. ఆమెను ఆ స్థితిలో చూడేలేకపోయాడు. భార్య తనకు ఎలాగు దక్కదని నిర్థారించుకున్నాడు. అంతే.. తాను లేకుండా తన జీవితం వ్యర్థమనుకొని.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అలా కన్నుమూసాడో లేదో.. మరికొద్ది సేపటికే హాస్పటల్ బెడ్ మీద ఉన్న భార్య కూడా కన్నుమూసింది. ఈ విషాద సంఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం నగరంలో వాంబేకాలనీకు చెందిన విజయ్‌భాస్కర్‌ (35) తన భార్య భాగ్యలక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో తట్టుకోలేక గురు వారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ఒకటో పట్టణ ఎస్‌.ఐ.చిన్నంనాయుడు తెలిపారు. 

ఎస్‌.ఐ. తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 18 ఏళ్ల కిందట వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి పెద్దలను వదిలి ఒంటరిగానే జీవిస్తున్నారు. వీరికి సంతానం లేదు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగర సమీపంలోని జెమ్స్‌ ఆసుపత్రిలో రక్తకణాలు క్షీణించే వ్యాధితో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మృతదేహలను శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరి మృతితో కుటుంబసభ్యులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌.ఐ. తెలిపారు.