ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య వేధింపులు భరించలేక భర్త చేట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేవరాజుగట్టు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. 

గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కటికల దావీడు (50)తో భార్యకు గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. స్థానికులు ఉదయం ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లారు. దాంతో కాలనీలో ఎవరూ లేరు. ఆ సమయంలో గ్రామ సమీపంలోని పెట్రోలు బంక్ వెనక వేప చెట్టుకు దావీదు ఉరేసుకున్నాడు. 

ఆత్మహత్యకు ముందు దావీదు తన చిన్న తమ్ముడికి ఫోన్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య బాలకుమారి, వివాహమైన కూతురు, కుమారుడు ఉన్నారు. 

ఇదిలావుంటే మద్దిపాడు మండలం నేలటూరి ఎస్సీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పి భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఎలీసమ్మకు నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన వడేల సుబ్బారావుతో పదేళ్ల క్రితం పెళ్లయింది. భర్త పనికి వెళ్లిన తర్వాత కడుపునొప్పి రావడంతో భరంచలేక ఎలీసమ్మ (28) ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది.