తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే భర్త ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట హరిజనవాడకు చెందిన ఎర్రా నరేంద్రబాబు చేనేత మగ్గాలు నేయిస్తుంటాడు.

ఈ క్రమంలో నీలకంఠపురానికి చెందిన గుత్తి అశోక్‌‌రాజు చేత మగ్గం పని చేయిస్తూ తరచూ నరేంద్ర అతని ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో నరేంద్ర తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నరేంద్రపై అశోక్‌రాజు.. అనుమానం పెంచుకుని అతనిని ఎలాగైనా అంతం చేయాలని కుట్రపన్నాడు.

ఈ క్రమంలో నిన్న దేశాయిపేట హరిజనవాడ సమీపంలో కాపుకాచి మోటారు సైకిలుపై వస్తోన్న నరేంద్రపై దాడి చేశాడు. దీంతో నరేంద్ర తల, కాలికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతనిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాగా, తనకు నరేంద్ర మగ్గం పనులు ఇస్తూ లొంగదీసుకుని ఆరు నెలలుగా అనుభవిస్తున్నాడని, నీ భర్తను చంపి నిన్ను పెళ్లి చేసుకుంటానని బెదిరించాడంటూ అశోక్ రాజు భార్య ప్రసన్నలక్ష్మీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది.

ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో తాను అతని వేధింపులు భరించానని, అయితే నెల క్రితం నరేంద్ర వ్యవహారం తన భర్తకు తెలిసి అతడిని మందలించాడని, పది రోజుల క్రితం ఇంటికి వచ్చి బలవంతం చేయబోయాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.