ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ మహిళలు విజయవాడకు చేరుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ మహిళలు విజయవాడకు చేరుకున్నారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బీసెంట్ రోడ్డులో పెద్ద ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు బైఠాయించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా సమస్యలను పరిష్కారించాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడలో భారీ నిరసన చేపట్టేందుకు సిద్దమైన అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకోవడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే విజయవాడలోని పలు ప్రాంతాల్లో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి. అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అంగన్‌వాడీ కార్యకర్త స్పృహ కోల్పోయి పడింది. దీంతో తోటి అంగన్‌వాడీ కార్యకర్తలు ఆమెపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. అయితే పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

ఇక, రాష్ట్రంలో అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పలు జిల్లాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడకు బయలుదేరారు. దీంతో పోలీసులు జిల్లాల్లోనే అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వారిని అడ్డుకుని విజయవాడ వెళ్లకుండా చూశారు. అలాగే పలువురు నాయకులకు నోటీసులు అందజేశారు. ఆందోళనలకు అనుమతి లేనందున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అయితే పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా పెద్ద ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడకు చేరుకున్నారు.