కేంద్రం నూతన విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నూతన విద్యావిధానంలో ఎన్నో సంస్కరణలకు కేంద్రం పురుడు పోసింది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన దగ్గరి నుండి మొదలు ఇష్టమున్న కోర్సును ఎంచుకునే స్వేచ్ఛను  కల్పించేంతవరకు అనేక నూతన ఒరవడులకు ఈ నూతన విధానము తెర తీయనుంది. 

ఈ నూతన విద్యావిధానం రూపకల్పనలో పవన్ కళ్యాణ్ పాత్రకూడా దాగుందన్న విషయం మనలోఎంతమందికి తెలుసు. ఇదే విషయాన్నీ స్వయంగా కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

నూతన విద్యావిధానంలో పవన్ కళ్యాణ్ ఆలోచనలకు స్థానం కల్పించినట్టుగా చెబుతూ పవన్ కళ్యాణ్ 2019లో మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసారు మంత్రిగారు. ఈ నూతన విద్యావిధానంలో కేవలం కొన్ని కోర్సులే కాకుండా విద్యార్థులకు వారి సొంత సబ్జెక్టులను ఎన్నుకునే అవకాశం కల్పిస్తుంది అని రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ చేసారు. 

జత చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ సైతం ఇలా విద్యార్థికి ఎన్నుకునే అవకాశం కల్పిస్తే బాగుండునని, తాను  అలాగే అనిపించేదని అన్నాడు. తాను చదువుకునే రోజుల్లో తనకు వేరే ఏదైనా కోర్స్ చదువుకోవాలని బలంగా ఉండేదని, ఏదైనా వృత్తి విద్య కానీ, పెయింటింగ్ కానీ ఏదైనా ఒకటి నేర్చుకోవాలని ఉండేదని పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో తెలిపాడు. 

ఇలా వృత్తి విద్యను నేర్పడం ద్వారా యువతకు ఎంతో మేలు చేకూరుతుందన్నాడు పవన్ కళ్యాణ్. వారి హాబీ ని మెరుగుపరుచుకుంటూ ఉన్నత ఉపాధి అవకాశాలు పొందేందుకు తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. 

స్కూల్ నుంచి కళాశాల స్థాయిలో ఒక స్కిల్ కానీ, ఒక కళ గాని వారి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే దాన్ని ప్రతివిద్యార్థికి నేర్పించాలని కోరారు. కొత్త విద్యావిధానం అనేదాన్ని తీసుకొస్తే అందులో ఇది పొందుపరచాలని కోరారు. 

పవన్ కళ్యాణ్ విడియోతోపాటుగా మానవవనరుల మంత్రిత్వ శాఖ వారు ఆ దిశగా తీసుకొచ్చిన సంస్కరణల గురించి చెబుతున్న వీడియోను కూడా దానికే జత చేసారు.