ప్రస్తుత పరిస్దితుల్లో అంత ఖర్చును పార్టీ నేతలు ఏ విధంగా వ్యయం చేస్తారు? నేతల వద్ద అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది.

రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం పెద్ద సాహసమే చేస్తున్నది. ఈనెల 26వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో జరుపుతున్న రైతు మహాసభలో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతున్నారు. మామూలుగా అయితే భాజపా ఆధ్వర్యంలో జరుగనున్న సభకు జాతీయ అధ్యక్షుడు సభకు హాజరవ్వటం పెద్ద విశేషమేమీ కాదు. కానీ పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపధ్యంలో భారీ సభ నిర్వహించటమే పెద్ద సాహసం. అటువంటిది ఏకంగా జాతీయ అధ్యక్షుడిని పిలిపించటమంటే మరింత సాహసమనే చెప్పాలి.

ఏ పార్టీ బహిరంగ సభ నిర్వహించినా పొలోమంటూ సభలకు వచ్చే జనాలు ఎవరూ లేరన్న విషయం అందరికీ తెలిసిందే. కార్యకర్తల దన్ను, ప్రజల మద్దతున్న పార్టీలు నిర్వహిస్తున్న సభలకే జనాలు కనిపించని రోజులివి. అటువంటిది రాష్ట్రంలో భాజపా బలమెంతన్నది అందరికీ తెలిసిందే. అందులోనూ నోట్ల రద్దు నేపధ్యంలో గడచిన పది రోజులుగా రాష్ట్రంలో కూడా ప్రజల్లో తీవ్రమైన ఆందోళన కనబడుతోంది.

ఇటువంటి నేపద్యంలో భాజపా భారీ బహిరంగ సభ నిర్వహించటమంటే ఒకరకంగా బలప్రదర్శనకు దిగుతున్నట్లే. ఏ పార్టీ అయినా బహిరంగ సభ నిర్వహించాలంటే ఖర్చు కోట్లలో మాటే. అటువంటిది జాతీయ అధ్యక్షుడిని పిలిపిస్తూ, ఒకరకంగా బలప్రదర్శన లాంటిది చేపడుతున్నపుడు మరింత ఖర్చు అవుతుందనటంలో సందేహం అక్కర్లేదు. ఎంత ఎక్కువ జనాలు వస్తే ఆ సభ అంత విజయవంతమైనట్లు లెక్క. అటువంటిది ఎంత తక్కువ అనుకున్నా అమిత్ షా వస్తున్న సభకు కనీసం 50 వేల మందికి తక్కువ హాజరైతే బాగుండదు.

అంతమందిని సభకు సమీకరించాలంటే ఏ స్దాయిలో పార్టీ ఖర్చు చేయాలో అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్దితుల్లో అంత ఖర్చును పార్టీ నేతలు ఏ విధంగా వ్యయం చేస్తారు? నేతల వద్ద అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది. నోట్ల రద్దు కాకపోయుంటే సభా నిర్వహణ అసలు సమస్యే కాదు. కానీ ఇప్పటి పరిస్దితుల్లో ఎవరిని కదిపినా 100, 50 రూపాయలున్నాయా అనే అడుగుతున్నారు. సభకు హాజరయ్యే జనాలకు వెయ్యి, 500 రూపాయలిస్తామంటే ఎవరూ రారు. వారికందరికీ ఇవ్వాల్సింది 100, 50 రూపాయల నోట్లే. బిర్యానీ తదితరాలు మామూలే అనుకోండి. అంతమందికి ఇవ్వటానికి భాజపా నేతలు భారీ మొత్తంలో చిన్న నోట్లను ఏ రీతిలో సమీకరిస్తుందో చూడాలి.