మిర్యాలగూడలో ప్రణయ్-అమృతల ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యల ఘటనలు మరింత పెరుగుతున్నాయి. మంచిర్యాలలో వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో సొంత కూతర్ని చంపిన ఘటనను మరవక ముందే గుంటూరులో మరో పరువుహత్య చోటు చేసుకుంది.

కూతుర్ని ప్రేమించాడనే కక్ష్యతో ఆమె తండ్రి ఓ యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. పెదకూరపాడు మండలం హుస్సేన్‌సాగరం గ్రామానికి చెందిన సుధాకర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు.

రెండేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం బాలిక తండ్రి శ్రీనివాసరావుకి తెలిసింది. వేరే కులానికి చెందిన కుర్రాడు.. తన కూతుర్నీ ప్రేమిస్తుండటం తట్టుకోలేని అతను సుధాకర్‌ను అంతమొందించాలని నిర్ణయించాడు.

దీనిలో భాగంగా బంధువులు, స్నేహితుల సహకారంతో సుధాకర్ హత్యకు కుట్ర పన్నాడు. పథకంలో భాగంగా తన కుమార్తె ఫోన్ నుంచి అతని ఫోన్‌కు చేసి.. అర్జంటుగా కలవాలని పెదకూరపాడుకు రావాల్సిందిగా చెప్పాడు.

ఇది నిజమని నమ్మిన సుధాకర్ విజయవాడ నుంచి పెదకూరపాడుకు వచ్చాడు. ఊరి చివర తన బంధువులతో కలిసి మాటు వేసిన శ్రీనివాసరావు కర్రలు, ఇనుపరాడ్లతో వెంబడించాడు. దీనిని దూరం నుంచి గమనించిన గ్రామస్తులు శ్రీనివాసరావు ముఠా బారి నుంచి సుధాకర్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు.

అయినప్పటికీ వారు అతనిని వదలకుండా మారణాయుధాలతో విచక్షణారహితంగా కొట్టారు. గ్రామస్తులు తరుముకొస్తుండటంతో అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడివున్న సుధాకర్‌ను గ్రామస్తులు సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, సుధాకర్ హత్య తర్వాత శ్రీనివాసరావు అతని కుటుంబంతో సహా ఊరి నుంచి పారిపోయాడు.