ప్రకాశం: ప్రకాశం జిల్లాలో అత్యాచారానికి గురైన బాలికను హోంమంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, తానేటి వనితలు పరామర్శించారు. బాధితురాలికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ధైర్యంగా ఉండాలని బాధితురాలికి సూచించారు.

బాధిత బాలికకు రూ.10లక్షల పరిహారంతో పాటు భద్రత కల్పిస్తామని సుచరిత హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు ఉండరని పిల్లలు ఆ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 

ప్రస్తుతం ఉన్న చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. బాధితురాలికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు.

మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు అత్యాచార ఘటనపై ఆరా తీశారు. బాధితురాలికి పరిహారం అందజేయాలని ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి సుచరిత బృందం బాధితురాలిని పరామర్శించింది.  

మరోవైపు చినగంజాంలో టీడీపీ కార్యకర్త పద్మ ఆత్మహత్యపై సుచరిత స్పందించారు. దాడిచేసింది ఏ పార్టీవారైనా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయని ఆమె అభిఇప్రాయపడ్డారు. వ్యక్తిగత ఘర్షణలకు కూడా రాజకీయ రంగు పులుముతున్నారని అది సరికాదంటూ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు.