అమరావతి: మనిషి ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదని చాటుకున్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. రోడ్డు ప్రమాదానికి గురయి గాయాలతో పడివున్న వ్యక్తిని కాపాడటమే కాదు స్వయంగా తన కాన్వాయ్ లోని వాహనంలో హాస్పిటల్ కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. కీలకమైన కేబినెట్ సమావేశానికి వెళుతూ కూడా ఓ వ్యక్తి గాయాలతో పడివుండటం చూసి తట్టుకోలేకపోయిన మంత్రి అతడికి సాయం చేశారు. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం ఉదయం కరకట్ట రోడ్డుపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న బైక్ ను ఆటో ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఇలా అతడు గాయాలతో పడివున్న ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అలాగే గాయాలతో బాధపడుతూ సాయం కోసం ఎదురుచూడసాగాడు. 

ఇదే సమయంలో అదే దారిలో కేబినెట్ సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్న హోంమంత్రి సుచరిత అతన్ని గమనించి తన కాన్వాయ్ ని ఆపి అతడికి సాయం చేశారు. గాయాలపాలయిన నరసింహారావును తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.  అతడికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాతే అక్కడినుండి వెళ్లిపోయారు. 

ప్రస్తుతం నరసింహారావు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాయం చేసిన మంత్రి సుచరిత కు బాధితుడితో పాటు అతడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.