ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్!
హోమ్ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి ఎలా ఉంది, తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
కరోనా వైరస్ పై పోరులో భాగంగా ప్రభుత్వం విధించిన నాలుగవ దఫా లాక్ డౌన్ కూడా ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సంప్రదింపుల్లో భాగంగా హోమ్ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి ఎలా ఉంది, తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. లాక్ డౌన్ ఎలా అమలవుతోంది, కరోనా వ్యాప్తి ఏ ప్రాంతంలో ఎలా ఉంది వంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు అమిత్ షా.
రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు, టెస్టులను అధికంగా నిర్వహిస్తున్నామని, కేసుల సంఖ్యా కూడా టెస్టులతో పోల్చి చూసుకుంటే ఒక మోస్తరుగానే ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం.
రాష్ట్రంలో కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను సమర్థవంతంగా చేపడుతున్నామని, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నట్టు జగన్ మోహన్ రెడ్డి హోమ్ మంత్రి అమిత్ షాకు చెప్పినట్టు తెలియవస్తుంది.
ఇకపోతే... దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకు విజృంభిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు మార్చి 25న విధించిన లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నా కొద్దీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైతోపాటు హస్తిన సహా ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో పరిస్థితి విషమంగా మారుతున్నది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,65,799 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ కేసుల్లో ఇంతకుముందే చైనాను దాటిన భారత్ తాజాగా మరణాల్లోనూ ఆ దేశాన్ని అధిగమించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో 175 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,706కు చేరుకున్నది. చైనాలో ఇప్పటి వరకు 4,638 మంది మరణించారు.
మరోవైపు, 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 7,466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా వైరస్ బయట పడిన తర్వాత ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.