హిందూపురం వైసీపీలో అసమ్మతి సెగలను చల్లార్చే పనిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, అబ్ధుల్ ఘనీ వర్గాలను ఆయన మంగళవారం తాడేపల్లికి పిలిపించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి (ysrcp) అంతర్గత కుమ్ములాటలతో తలబొప్పి కడుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. నిత్యం ఎవరో ఒకరు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుండటంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. దీంతో ఈ విషయాలు సీఎం జగన్ (ys jagan) వరకు వెళ్లడంతో రాజీ కుదిర్చే బాధ్యతలను పార్టీ పెద్దలకు అప్పగిస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురంలో (hindupur) ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, అబ్ధుల్ ఘనీ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా అక్కడ అసమ్మతి వర్గాలు ఒక్కటవుతున్నాయి. మొన్నామధ్య ప్రెస్ క్లబ్ వేదికగా నేతల మధ్య రాళ్ల దాడి సైతం జరిగింది. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. వీరి మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి (peddireddy ramachandra reddy) అప్పగించారు జగన్. దీంతో మూడు వర్గాలను మంత్రి అమరావతికి పిలిపించి మాట్లాడారు. 

ALso Read:హిందూపురం : సీక్రెట్‌గా వైసీపీ నేతల ప్రెస్‌మీట్.. ప్రెస్‌ క్లబ్‌పై ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరుల రాళ్ల దాడి

అయితే సయోధ్య కోసం పిలిస్తే వీరంతా మంత్రి స‌మ‌క్షంలోనే బాహాబాహీకి దిగారు. పెద్దిరెడ్డి వారించ‌డంతో వెన‌క్కు త‌గ్గిన నేతలు ప‌రస్ప‌రం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇక్బాల్ వ‌ర్గంపై న‌వీన్ నిశ్చ‌ల్‌, అబ్దుల్ ఘ‌నీలు మూకుమ్మ‌డిగా కంప్లయంట్ చేశారు. హిందూపురం స‌మ‌న్వ‌క‌ర్త‌గా ఇక్బాల్‌ను కొన‌సాగిస్తే తాము ప‌నిచేయ‌లేమ‌ని వారు కుండబద్ధలు కొట్టారు. ఇక్బాల్ కార‌ణంగా తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఆరోపించారు. హిందూపురం వైసీపీలో సాధారణ పరిస్ధితులు రావాలంటే ఇక్బాల్‌ను త‌ప్పించాల్సిందేన‌ని వారు తెగేసి చెప్పారు. స్థానికేత‌రుడైన ఇక్బాల్‌కు ఈసారి హిందూపురం టికెట్ ఇవ్వొద్దని పెద్దిరెడ్డికి వారు సూచించారు.

అయితే తనను ఒంటరిని చేసి రెండు వ‌ర్గాలు మూకుమ్మ‌డిగా ఫిర్యాదు చేయ‌డంతో ఇక్బాల్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తే తాను హిందూపురాన్ని వదిలి మరో చోటకి వెళ్తానని ఆయ‌న పెద్దిరెడ్డికి తెలిపారు. అందరి వాదనలను విన్న రామచంద్రారెడ్డి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా జ‌గ‌న్ సమక్షంలోనే పంచాయతీ పెట్టించాలని ఆయన భావిస్తున్నట్లుగా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.