పార్టీలో నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అధికార వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురంలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డి అనుచరులు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది.   

పార్టీలో నేతల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కుతూ వుండటంతో వైసీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. ఇటీవల కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ- దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ- యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరీ- పేర్ని నాని వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నడిచిన సంగతి తెలిసిందే. దీంతో వీరిని తాడేపల్లికి పిలిచిన వైసీపీ పెద్దలు మందలించి పంపారు. 

తాజాగా సత్యసాయి జిల్లా (sathya sai district) హిందూపురంలో (hindupur) వైసీపీలో (ysrcp) వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ (sheikh muhammad iqbal) , సీనియర్‌నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి (konduru venugopal reddy) అనుచరుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్సీ అనుచరులు రౌడీయిజం, అక్రమాలు ఆపాలంటూ నియోజకవర్గంలోని 20 మందికి పైగా కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ALso Read:జగన్ వద్దకు గన్నవరం, బందర్ పంచాయతీలు... లైన్ దాటితే చర్యలు తప్పవు: నేతలకు సీఎం హెచ్చరిక

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వర్గీయులు ప్రెస్‌క్లబ్‌ వద్దకు దూసుకొచ్చారు. అంతేకాదు క్లబ్‌పై రాళ్ల దాడి చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా చేరుకుని.. ఎమ్మెల్సీ వర్గీయులను ప్రెస్‌క్లబ్‌ వద్ద నుంచి పంపించివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరి ఈ వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఇకపోతే.. ఇటీవల ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్‌కి (audimulapu suresh) సొంత నియోజకవర్గం యర్రగొండపాలెంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా గత వారం పుల్లల చెరువులోని ఓ తోటలో మండల స్థాయి నాయకులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో 9 మంది సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలతో పాటూ మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

యర్రగొండపాలెం నియోజకవర్గంలో పనులు చెయ్యకుండా.. గడప గడపకూ వెళ్లి మంత్రి సురేష్ ఏం చెబుతారని ఈ సమావేశంలో వారు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మంత్రి సురేష్ వలన తాము నష్టపోయామని సమావేశంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ కంచర్ల వీరయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. నియోజవర్గంలో ఏ పనులు చేయించుకోలేకపోయామని.. ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.