ఏపీలో వైసీపీలో మరోసారి వర్గవిబేధాలు తెరమీదికి వచ్చాయి. హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మీద మట్కా, అక్రమ మద్యం కేసులు ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హిందూపురం : సోమవారం ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ చైర్ పర్సన్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అధికార పార్టీ నేత కూడా. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ అయిన ఇంద్రజ భర్త శ్రీనివాసులతోపాటు ఆయన అనుచరులు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

మట్కా దందాతో పాటు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి అమ్ముతున్నారని ఆరోపణలు వారిమీద వచ్చాయి.ఈ నేపథ్యంలోనే వీరిని పట్టుకున్నట్లుగా సమాచారం. అయితే, మరోవైపు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త దీపిక వర్గీయులు తమపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఇంద్రజ, ఆమె భర్త గత కొంతకాలంగా చెబుతున్నారు. తమను దీపిక నాయకత్వానికి మద్దతు పలకలేదని వేధిస్తున్నారని, మున్సిపల్ సమావేశం కూడా నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఇంద్రజ ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల ఘాట్ రోడ్డుపై యాక్సిడెంట్... ఐదుగురు భక్తులకు గాయాలు

ప్రస్తుతం శ్రీనివాసులు, ఆయన అనుచరులను అరెస్టు చేయడంతో ఆ విషయం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఇంద్రజ, ఆమె భర్త ఆరోపించినట్లుగానే మట్కా, అక్రమ మద్యం విక్రయాల పేరుతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మీద పోలీసులు మాట్లాడుతూ.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.

హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు గుంపుమంటున్నాయి. అక్కడ కొందరి మాటే చెల్లుబాటు అవుతోంది. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్ధులు కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ఎమ్మెల్సీ, మాజీ సమన్వయకర్త ఇక్బాల్ హయాంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. ఆయన హయాంలో ముఖ్య నాయకులు, కొండూరు వేణుగోపాల్ రెడ్డి తదితరుల మీద కేసులు పెట్టించారు. 

తాజాగా, దీపిక కూడా అదే బాటలో నడుస్తోంది. సమన్వయకర్తగా నియమితురాలయినప్పటి నుంచి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మొదటినుంచి ఇంద్రజ కుటుంబం మీద మట్కా దందా ఆరోపణలు ఉన్నాయి. ఇంద్రజ భర్త శ్రీనివాసులు మీద చాన్నాళ్ళ క్రితమే మట్కా బీటర్ కింద కేసులు ఉన్నాయి.

కొన్నాళ్ల క్రితం వరకు పార్టీ సమన్వయకర్తగా ఉన్నఇక్బాల్ దగ్గర వీరి హవా నడిచింది. దీంతో జూదం, మట్కా, మద్యం లాంటి వాటికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. ఇక్బాల్ స్థానంలో దీపిక నియమితురాలవ్వడంతో గత కొంతకాలంగా కేసుల భయంతో వీటన్నింటిని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీపిక వీరిని తనదారికి తెచ్చుకోవడం కోసం తాజాగా ఇలాంటి కేసులు బనాయించినట్లుగా సమాచారం.