తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగి ఐదుగురు తమిళనాడు భక్తులు గాయపడ్డారు.
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ కొందరు భక్తులు ప్రమాదానికి గురయ్యారు. తిరుమల ఏడుకొండలపైకి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై టెంపో వాహనం అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు.
తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు టెంపో వాహనంలో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా 13వ మలుపు వద్ద టెంపో అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టి ఆగింది. దీంతో వాహనంలోని ఐదుగురు భక్తులు గాయపడ్డారు.
ప్రమాదం సమాచారం అందిన వెంటనే టిటిడి అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రమాదానికి గురయిన టెంపోను అక్కడినుండి తరలించారు.
Read More విషాదంగా మారిన విహారయాత్ర.. సముద్రంలోకి కొట్టుకుపోయిన ఆరుగురు స్నేహితులు
టెంపో రెయిలింగ్ ను ఢీకొని ఆగడంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ టెంపో రెయిలింగ్ ను దాటుకుని ముందుకు వెళ్లివుంటే లోయలో పడిపోయేదని... దీంతో అందులోని భక్తులు ప్రాణాలకే ప్రమాదం వుండేంది. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా భక్తులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలావుంటే తిరుమల కొండపైకి వెళ్లేదారిలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల అలిపిరి నడకమార్గంలో కుటుంబంతో కలిసి వెళుతున్న ఓ చిన్నారిని చిరుత బలితీసుకుంది. అలాగే ఎలుగుబంటి వంటి ప్రమాదకర అటవి జంతువులు కూడా కాలినడకన కొండపైకి వెళ్లే భక్తులను భయపెడుతున్నాయి. దీంతో టిటిడి, అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ చిరుత చేపట్టారు. అయితే తిరుమల కొండలపై గల అడవుల్లో బోన్లు ఏర్పాటుచేసి చిరుతలను పట్టుకుంటున్నారు.ఇలా కేవలం మూడురోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు అధికారులు ఏర్పాటుచేసిన బోనులో పడ్డాయి. ఈ చిరుతను ఎస్వీ జూ పార్క్‌కు తరలించారు.
