పంథా మార్చిన బాలయ్య

hindupuram MLA balakrishna visits his own constituency
Highlights

ఎన్నికల స్ట్రాటజీ మొదలెట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అప్పుడే ఎన్నికల స్ట్రాటజీ మొదలుపెట్టేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున హిందూపురం నుంచి పోటీ చేసిన ఆయన అఖండ విజయం సాధించారు. హిందూపురంలో టీడీపీకి ఎదురులేదనే విషయాన్ని ఆయన మరోసారి నిరూపించారు. అయితే.. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అయితే గెలిచారు కానీ..పెద్దగా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. అనే మాటలు మొన్నటి వరకు వినిపించాయి.

అలాంటి మాటలు వినపడటానికి కూడా కారణం లేకపోలేదు. ఆయన సినీనటుడు కావడంతో సినిమాలతో బిజీగా ఉండేవారు. దీంతో.. నియోజకవర్గాన్ని చుట్టపు చూపుగా మాత్రమే చూసివచ్చేవారు. అక్కడి పరిస్థితులను మరెవ్వరో చూసుకునేవారు.దీంతో ఆయనపై కాస్త వ్యతిరేకత మొదలైంది. అందుకే ఆ వ్యతిరేకతను తిరిగి అనుకూలంగా మార్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.

గత ఎన్నికల్లో చిలమత్తూరు మండలంలో బాలయ్యబాబుకి తక్కువ మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు మరింత దగ్గర కావాలని బాలకృష్ణ ప్రయత్నించారు. చాగలేరు గ్రామంలో దళితవాడలో సామూహిక సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. స్వయంగా ఒక మహిళకు భోజనం తినిపించారు. సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మొదటి రోజు బిజీగా గడిపారు. 

అదే రోజు దిగువల్లి తాండాలో ఒక ఇంట్లో పల్లెనిద్ర చేశారు. తెల్లవారు జామున త్రెడ్ మిల్‌పై వ్యాయమం చేశారు. ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. రెండవ రోజు ఇదే మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. వీరాపురంలో పల్లెనిద్ర చేశారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
     బాలయ్య వస్తున్నారంటే నియోజకవర్గ ముఖ్య నేతలంతా ఆయన వెంట ఉంటుంటారు. అయితే ఈసారి పంథాను మార్చారు. జిల్లా నేతలు కానీ.. స్థానిక నియోజకవర్గ నేతలు కానీ తన వెంట లేకుండా ఆయన జాగ్రత్తపడ్డారు. ఆయా గ్రామ నేతలను వెంటబెట్టుకుని వారినే వేదికల మీదకు ఎక్కించి మాట్లాడించారు. దీంతో స్థానిక నేతలకు బాలయ్య మరింత చేరువయ్యారనే అభిప్రాయం ఏర్పడింది. 

బాలయ్యకి కొంచెం కోపమెక్కువ అన్న భావన ప్రజల్లో ఉండేది. అయితే ఈసారి ఆయన ఎంతో ఓపికని ప్రదర్శించారు. ప్రతీ ఒక్కరు చెప్పే విషయాలను సావధానంగా వినడం తాజా కోణం. ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. ఆయా సమస్యలను పరిష్కారించమని అధికారులకు ఆదేశించారు. దీంతో.. నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

loader