Asianet News TeluguAsianet News Telugu

కాణిపాకంలో తేల్చుకుందాం రా ... నీ ముఖం మీదే రాజీనామా లేఖ విసిరికొడతా : చంద్రబాబుకు గోరంట్ల మాధవ్ సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. కాణిపాకం వచ్చి ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని చంద్రబాబు ప్రమాణం చేస్తే.. అప్పటికప్పుడే తన రాజీనామాను ఆయన ముఖం మీద కొడతానన్నారు. 

hindupur ysrcp mp gorantla madhav challenge to tdp chief chandrababu naidu
Author
Hindupur, First Published Aug 19, 2022, 4:40 PM IST

ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో టీడీపీ మరోసారి దొరికిపోయిందన్నారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది ఫేక్ వీడియో అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఏసీబీ కేసులో అడ్డంగా దొరికిపోయి, హైదరాబాద్‌ను వదులకుని ఎందుకు వచ్చారో చంద్రబాబు చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో దొంగలా దొరికిపోయి పారిపోయి వచ్చారంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు. సదరు ఆడియో టేపులో చంద్రబాబు మాటలు, ఆయన పంపించిన మనిషి డబ్బులు ఇచ్చిన వీడియో కూడా వుందని మాధవ్ అన్నారు. ఓటుకు నోటు కేసుపై ఒక్కసారైనా చర్చ పెట్టాలని ఈటీవీ, టీవీ5, ఏబీఎన్‌లను బీసీ సోదరులు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి.. గర్భవతినైనా చేయాలి అంటూ ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ పబ్లిక్ మీటింగ్‌లో అన్నారని ... దీనిపై ఏనాడైనా ఏబీఎన్, టీవీ5, ఈటీవీలో కానీ చర్చ జరిగిందా అని మాధవ్ ప్రశ్నించారు. యువతులతో లోకేశ్ వున్న ఫోటోలపైనా చర్చ జరగాలని ఆయన కోరారు. ఫేక్ వీడియోను వైరల్ చేసి.. బీసీ ఎంపీనైన తనను హింసిస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల మీద చర్చ లేకుండా ఒక్క తనపైనే చర్చే అంటే అది వారి కుల వివక్షకు, కుల దురహంకారానికి పరాకాష్ట అన్నారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు తన ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని మాధవ్ ఆరోపించారు. 

ALso REad:రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు.. ఎవరినీ వదలం, చట్టపరంగా చర్యలు : గోరంట్ల వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ వివరణ

ఓటుకు నోటు కేసులో దొరికిన రూ.50 లక్షలు తనవి కాదని, బ్రీఫ్డ్ మీ అని నేను  మాట్లాడలేదని, అది నాకు సంబంధం లేని ఆడియో అని కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని ఆయన అన్నారు. అలా జరిగిన వెంటనే నా రాజీనామా పత్రాన్ని ఎడమ చేత్తో నీ మూతి మీద పడేస్తానంటూ మాధవ్ సవాల్ విసిరారు. నాది ఫేక్ వీడియో అని ముక్కు నేలకు రాసి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ, దోపిడీ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. జయాపజయాలు దైవాధీనం, జనాధీనమన్నారు. అంతేకానీ టీవీ5, ఏబీఎన్, ఈటీవీ ఆధీనంలో వుండవని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడాలని గోరంట్ల మాధవ్ హితవు పలికారు. మహాభారతాన్ని తీసుకుంటే దుర్యోధనుడు కూడా ముందు గెలిచాడని.. చివరికి ధర్మం, పాండవులే గెలిచారని .. ఇక్కడ కూడా చివరికి విజయం తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోలు, దొంగ సర్టిఫికేట్లు తెచ్చి గెలిచానని అనుకోవద్దని.. చివరికి చట్టమే గెలుస్తుందన్నారు. తన ఫేక్ వీడియోపై డీజీపీకి ఫిర్యాదు చేశానని మాధవ్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios