Asianet News TeluguAsianet News Telugu

రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు.. ఎవరినీ వదలం, చట్టపరంగా చర్యలు : గోరంట్ల వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ వివరణ

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్‌ని కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారని సీఐడీ చీఫ్ తెలిపారు

ap cid chief sunil kumar press meet on ysrcp mp gorantla madhav video
Author
Amaravati, First Published Aug 18, 2022, 2:29 PM IST

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వివరణ ఇచ్చారు. ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ వుండదన్నారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికమని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆ వీడియోని మూడో వ్యక్తి షూట్ చేశాడని.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ అని ఆయన చెప్పారు. రెండు ఫోన్‌లలో జరిగిన సంభాషణే ఒరిజినల్ అని సునీల్ కుమార్ తెలిపారు. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల చెప్పారని.. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారని సునీల్ కుమార్ పేర్కొన్నారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. 

ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్‌ని కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారని సీఐడీ చీఫ్ తెలిపారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని .. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారని సునీల్ కుమార్ పేర్కొన్నారు. వీడియో కంటెంట్ ఒరిజనలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదని.. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నామన్నారు. రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారని.. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

Also Read:ఏపీలో చల్లారని గోరంట్ల వీడియో వ్యవహారం... మీరు రంగంలోకి దిగండి : సీబీఐకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు

అంతకుముందు విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav video). ‘న్యూడ్ వీడియో’ వివాదం అనంతరం తొలిసారిగా హిందూపురానికి బయల్దేరిన మాధవ్‌కు ఆదివారం కర్నూలు టోల్‌గేట్ వద్ద కురుమ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ... మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాధవ్ వ్యాఖ్యానించారు. వీడియో మార్ఫింగ్‌దా లేదంటే నిజమైనదా అని తేల్చేందుకు పోలీసులు వున్నారని ఆయన అన్నారు. తనపై దుష్ప్రచారం ఆపకుంటే పాత మాధవ్‌ను చూస్తారంటూ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. 

కాగా.. ఈ నెల 10వ తేదీన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఎంపీ మాధవ్ వీడియో నకిలీదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను పోస్టు చేసిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని.. దీనిని మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసినట్టుగా ఉందని, ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని ఎస్పీ వివరించారు. అనంతపురం ఎస్పీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా ఈ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. ఎస్పీ ఫోరెన్సిక్ నిపుణుడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios