ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో వుండే హిందూపురం తెలుగువారికి ఓ సెంటిమెంట్. తెలుగువారి ఆరాధ్యదైవం, అన్న నందమూరి తారకరామారావు ఇక్కడి నుంచే పలుమార్లు చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం, అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచాయి. సైకిల్ ఇక్కడ గెలిచినంతగా రాష్ట్రంలో మరెక్కడా గెలవలేదని చెప్పాలి. బెంగళూరు నగరానికి అత్యంత సమీపంలో వుండటంతో పారిశ్రామికంగానూ హిందూపురం అభివృద్ధి చెందుతోంది. బీసీలతో పాటు మైనారిటీలు ఇక్కడ అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశిస్తున్నారు. టీడీపీ కంచుకోటలో పాగా వేసిన వైసీపీ మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. కర్ణాటక బీజేపీ సీనియర్ నేత శ్రీరాములు సోదరి, బళ్లారి మాజీ ఎంపీ జే శాంతకు టికెట్ ఖరారు చేశారు జగన్.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే వుంటాయి. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో వుండే హిందూపురం తెలుగువారికి ఓ సెంటిమెంట్. తెలుగువారి ఆరాధ్యదైవం, అన్న నందమూరి తారకరామారావు ఇక్కడి నుంచే పలుమార్లు చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం, అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచాయి. సైకిల్ ఇక్కడ గెలిచినంతగా రాష్ట్రంలో మరెక్కడా గెలవలేదని చెప్పాలి.
కుప్పంలోనూ చంద్రబాబు ఏడుసార్లు మాత్రమే గెలవగా.. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధులు 9 సార్లు విజయం సాధించారు. ఇక్కడ సైకిల్ జైత్రయాత్రకే బ్రేక్ వేయాలని మహామహులు ట్రై చేసినా వల్ల కాలేదు. రాష్ట్రమంతా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినా హిందూపురంలో మాత్రం తెలుగుదేశం విజయం ఖాయమనే సెంటిమెంట్ వుంది. బీసీలకు పట్టున్న ప్రాంతం కావడంతో సైకిల్ సవారి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతూ వస్తోంది. బెంగళూరు నగరానికి అత్యంత సమీపంలో వుండటంతో పారిశ్రామికంగానూ హిందూపురం అభివృద్ధి చెందుతోంది. బీసీలతో పాటు మైనారిటీలు ఇక్కడ అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశిస్తున్నారు.
హిందూపురం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ కంచుకోటలో వైసీపీ పాగా :
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం , కదిరి అసెంబ్లీ స్థానాలున్నాయి. హిందూపురం పార్లమెంట్ పరిధిలో 15,78,218 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 7,82,709 మంది.. మహిళలు 7,95,437 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 13,38,514 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 84.81 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 6 చోట్ల వైసీపీ విజయం సాధించింది. నాటి లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కురువ గోరంట్ల మాధవ్‌కి 7,06,602 ఓట్లు .. టీడీపీ అభ్యర్ధి నిమ్మల కిష్టప్పకి 5,65,854 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 1,40,748 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
టీడీపీ కంచుకోటలో పాగా వేసిన వైసీపీ మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో కురుబ సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్‌కి టికెట్ ఇచ్చి జగన్ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి గోరంట్లకు జగన్ టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా కర్ణాటక బీజేపీ సీనియర్ నేత శ్రీరాములు సోదరి, బళ్లారి మాజీ ఎంపీ జే శాంతకు టికెట్ ఖరారు చేశారు. గుంతకల్లుకు చెందిన శాంత.. వాల్మీకి సామాజికవర్గానికి చెందినవారు. 2009లో ఆమె బీజేపీ తరపున బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
హిందూపురం ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :
టీడీపీ విషయానికి వస్తే.. హిందూపురం తొలి నుంచి కంచుకోట . 2019లో లెక్క తప్పినప్పటికీ ఈసారి మాత్రం సీటును నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా వుండే ఈ ప్రాంతంలో అంబికా లక్ష్మీనారాయణకే టికెట్ ఇవ్వాలని వాల్మీకి సేవాదళ్ టీడీపీ అధిష్టానాన్ని కోరుతోంది. మరోవైపు సీనియర్ నేత పార్థసారథి పేరును కూడా తెలుగుదేశం పరిశీలిస్తోంది. అయితే జనసేన, బీజేపీ, టీడీపీలతో పొత్తు ఖరారైన నేపథ్యంలో హిందూపురాన్ని బీజేపీ లేదా జనసేన కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి కంచుకోటను తెలుగుదేశం వదులుకుంటుందా అన్నది చూడాలి.
