ఏపీలో ఎండలు మండిపడుతున్నాయి. మొన్నటి వరకు ఫణి తుఫాను ప్రభావంతో కాస్త  వాతావరణం చల్లబడింది. అది కాస్త పోవడంతో... వాతావరణం మళ్లీ యాదావిదిగా మారింది. ఎప్పుడూలేని విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. దీంతో జనం విలవిలలాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలోని ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదౌతున్నాయి.

ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజలు మరింత ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ఎండలు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో అత్యధికంగా 46.99 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో 46.62 డిగ్రీల ఉష్ణోగ్రత, కృష్ణా జిల్లా జి.కొండూరులో 46.54 డిగ్రీలు, విజయవాడలో 46.26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కాగా మరో వైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్‌  కూడా (ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఏపీలోని ఐదు జిల్లాల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతున్నట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.  ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో అత్యధికంగా పోలవరంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 52 చోట్ల 45 డిగ్రీల కంటే ఎక్కువ, 127 చోట్ల 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.