తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడి పందేలు ఆడిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయని వారిని వదిలిపెట్టే ప్రశక్తే లేదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఖాతరు చేయని వారికి సంబంధించిన అన్నీ వివరాలు వెంటనే తమకు అందచేయాలంటూ కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాలతో పలువురు టిడిపి నేతలకు షాక్ కొట్టినట్లైంది.

ఇంతకీ విషయం ఏమిటంటే,మొన్నటి సంక్రాంతి పండుగ సంరద్భంగా రాష్ట్రంలోని చాలా చోట్ల కోళ్ళపందేలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటికే రాష్ట్రంలో ఎక్కడ కూడా కోళ్ళపందేలు జరిగేందుకు లేదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి అందరకీ తెలిసిందే. అయినా సరే చాలా చోట్ల కోళ్ళపందేలు యధేచ్చగా జరిగిపోయాయి. అందులోనూ టిడిపి ఎంపిలు, ఎంఎల్ఏలే దగ్గరుండి మరీ పందేలు జరిపించారు. అవన్నీ మాడియాలో ఆధారాలతో సహా కనిపించాయి.

అప్పట్లో ఇదే విషయమై అప్పట్లో చంద్రబాబునాయుడు కూడా పలువురు ఎంఎల్ఏలపై మండిపడ్డారు. అదే ఇపుడు వారికి పెద్ద సమస్యగా మారబోతోంది. తాము ఆదేశాలు జారీ చేసినా ఖాతరు చేయలేదంటూ కోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు బాగా తలంటింది. టిడిపి నేతలే దగ్గరుండి మరీ పందేలను నిర్వహించినపుడు పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? టిడిపి నేతల నిర్వాకం సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు అందాయి.

సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు వెంటనే వారికి నోటీసులు అందచేయాలని ఆదేశించింది. కోళ్ళపందేలను దగ్గరుండి నిర్వహించిన వారి హోదాలు, చిరునామాలతో సహా పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గుంటూరు జిల్లాలో కోడి పందేలు ఆడిన టిడిపి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.