అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి సోమవారం ఆమరణ దీక్షకు దిగుతామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఇప్పుడున్న బలగాలకు అదనంగా పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని తాడిపత్రిలో దింపారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు జేసీ బ్రదర్స్, పెద్దారెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీ కవాతు నిర్వహించారు.

పట్టణంలో 144 సెక్షన్, 30యాక్ట్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండరాదని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసు యంత్రాంగం వార్నింగ్ ఇచ్చింది. కాగా గత పది రోజులుగా జేసీ వర్గానికి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా, ఎస్సీ, ఎస్టీ చట్టాలను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని, ఇష్టానుసారంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని జేసీ బ్రదర్స్ ఆరోపించారు.  ఈ ఆరోపణల నేపథ్యంలోనే సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామంటూ జేసీ బ్రదర్స్ ప్రకటించారు.