ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసినా... వివాదాలు మాత్రం ఇంకా సమసిపోవడం లేదు. నెల్లూరులో అయితే.. టెన్షన్ వాతావరణం నడుస్తోంది. నెల్లూరులో టీడీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిరుమలనాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆదివారం దాడిచేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. 

సోమవారం కూడా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అమృల్లాపై కూడా వారు దాడిచేశారు. ఈ దాడిని ఖండిస్తూ నెల్లూరు నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. తిరుమలనాయుడి భార్య అన్విత, టీడీపీ నేతలు, కొందరు మహిళలతో కలిసి వైసీపీ ఆఫీసు వద్ద దీక్ష చేశారు. 

తన భర్తకు ఎలాంటి ప్రాణహాని ఉండబోదని ఎమ్మెల్యే కోటంరెడ్డి వచ్చి చెప్పే వరకు తాను దీక్ష విరమించబోనని తన ఆరునెలల చంటిబిడ్డతో సహా అక్కడ బైఠాయించారు. టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆమె దీక్ష విరమింపచేయడానికి శతవిథాలా ప్రయత్నిస్తున్నా.. ఫలితం లేకుండా పోయింది. 

తనకు ఎమ్మెల్యే హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో నెల్లూరులో హై టెన్షన్ గా ఉంది. ఎప్పుడు ఏ వివాదం జరుగుతుందా అని పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు.