టీడీపీ శ్రేణులను చూస్తూ సీఐ మీసం తిప్పి మెలేయడంతో కదిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో ఆక్రమణల తొలగింపు సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ తిరువీధులలో అధికారులు ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ఇంటి యజమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీనికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అక్కడికి చేరుకుని నిర్వాసితులకు మద్ధతు ప్రకటించారు. అటు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న సీఐ తమ్మిశెట్టికి కందికుంటకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదే సమయంలో తను ఉద్దేశిస్తూ సీఐ అసభ్యపదజాలంతో దూషించాడంటూ తెలుగు మహిళ కార్యకర్తలు భగ్గుమన్నారు. వెంటనే తమ్మిశెట్టి మధు ఇంటి వద్ద ధర్నాకు దిగారు. అక్కడికి కందికుంట కూడా చేరుకున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు కూడా పోలీసులకు మద్ధతుగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, బాటిళ్లు, చెప్పులను విసురుకున్నారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
Also REad: టిడ్కో ఇళ్ల కేటాయింపు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య సవాళ్లు : మండపేటలో హైటెన్షన్
మరోవైపు.. పట్టణ సీఐ మధు మీసం మెలేయడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వైసీపీ నేతలు, కార్యకర్తలు మధును తమ భుజాలపైకి ఎత్తుకుని తిప్పిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలావుండగా.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టీడీపీ శ్రేణులను మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, పార్థసారతి తదితరులు పరామర్శించారు.
