విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చేందుకు తీసుకొచ్చిన జేసీబీ అద్దాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరోవైపు అయ్యన్న ఇంటి వద్దకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చేందుకు తీసుకొచ్చిన జేసీబీ అద్దాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అలాగే అనకాపల్లి నుంచి వస్తోన్న మరో జేసీబీని దుంగనవాని పాలెం వద్ద అడ్డుకున్నారు. జేసీబీ టైర్లలో గాలిని తీసివేయడంతో అది అక్కడే నిలిచిపోయింది. మరోవైపు అయ్యన్న ఇంటి వద్దకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయ్యన్న కుటుంబానికి మద్ధతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. 

ఇకపోతే.. ఆయన ఇంటి దగ్గర రెవెన్యూ శాఖ ప్రారంభించిన సర్వేకు (survey) తాత్కాలికంగా బ్రేక్ పడింది. జాయింట్ సర్వే చేపట్టాలని అయ్యన్నపాత్రుడి కుటుంబం కోరడంతో అధికారులు సమ్మతించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సర్వేయర్ల సమక్షంలో రేపు భూమిని సర్వే చేయనున్నారు. కాగా.. నర్సీపట్నంలో ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా కొనసాగింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అయ్యన్నపాత్రుడు ఇల్లు కట్టారంటూ కూల్చివేతకు దిగారు అధికారులు. ఆదివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు మొదలయ్యాయి. అయితే కూల్చివేతలను అయ్యన్న అనుచరులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చారు. 

అంతకుముందు .. మధ్యాహ్నం RDO గోవిందరాజులుతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతి చర్చించారు. జాయింట్ సర్వే నిర్వహించాలని ఆర్డీఓకు అయ్యన్నపాత్రుడి ఫ్యామిలీ మెంబర్లు వినతిపత్రం ఇచ్చారు. అయితే జాయింట్ సర్వే కాకుండా ఐదుగురు సభ్యుల బృందంతో సర్వే చేస్తామని ఆర్డీఓ చెప్పారు. అయితే సర్వే కోసం సర్వేయర్ల బృందం నుండి పీల్డ్ మేజర్ మెంట్ బుక్స్ టీడీపీ కార్యకర్తలు లాక్కెళ్లారు. ఈ బుక్ ను తీసుకెళ్లేందుకు వెళ్లిన పోలీసుల్లో ఒక Conistable ను టీడీపీ కార్యకర్తలు నిర్భంధించారు. ఇదే సమయంలో పోలీసులు అయ్యన్న ఇంట్లో ఉన్న కానిస్టేబుల్ ను బయటకు తీసుకువచ్చారు. అదే విధంగా ఇరిగేషన్ అధికారుల పీల్డ్ మేజర్ మెంట్ బుక్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

పంట కాలువలో సుమారు 3సెంట్ల భూమిని ఆక్రమించుకొని అయ్యన్నపాత్రుడు ఇంటిని నిర్మించారని ఆర్డీఓ గోవిందరాజులు మీడియాకు చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటామని ఆర్డీఓ చెప్పారు. గతంలో ఇదే విషయమై అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇస్తే తీసుకోలేదన్నారు. దీంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లారన్నారు. ఇవాళ ఉదయం కూడా నోటీసులు ఇచ్చి గోడను కూల్చివేశామని ఆర్డీఓ గోవిందరాజులు మీడియాకు చెప్పారు