టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయన పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు గాయం కావడంతో .. వారికి మంత్రి క్యాంప్ కార్యాలయంలోనే చికిత్స అందించారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
అంతకుముందు ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అన్నారు. అధికారంలో వుండగా దళితులను పట్టించుకోకుండా అవమానించిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హతే లేదన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ అవహేళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు దళితుల ఓట్లు కావాల్సి వచ్చాయని... అందుకోసమే దళితులపై ప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి అన్నారు.
Also Read: బాబూ కొడుకులిద్దరూ దళిత ద్రోహులే... ఇక్కడికొచ్చే అర్హతెక్కడిది : మంత్రి సురేష్ సీరియస్
చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనపై జిల్లా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనపై మంత్రి ఆదిమూలపు సీరియస్ అయ్యారు. దళిత ప్రజలనే కాదు సొంత పార్టీ దళిత నాయకులను సైతం హేళన చేస్తూ చంద్రబాబు అవమానిస్తుంటారని మంత్రి అన్నారు.
ఇటీవల యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ ఎరిక్షన్ బాబును చంద్రబాబు ఘోరంగా అవమానించారని మంత్రి సురేష్ పేర్కొన్నారు. నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు యర్రగొండపాలెంలో టిడిపి పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ఏ చెట్టూ లేనిచోట ఆముదపు వృక్షమే గొప్పది అయినట్లు ఇక్కడ ఎరీక్షన్ బాబే టిడిపి మహావృక్షం అని అనలేదా? అని చంద్రబాబును నిలదీసారు. టిడిపిలో తీవ్ర అమవానాలు ఎదుర్కొంటూ కూడా దళిత నాయకులు అందులోనే ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. దళితులు ఏమీ పీకలేరంటూ చులకనగా మాట్లాడిన నాయకుడిని ఎదిరించకుండా ఎలా వుంటున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
