తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటనపై స్పందిస్తూ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ప్రకాశం : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని ఏపీ పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అధికారంలో వుండగా దళితులను పట్టించుకోకుండా అవమానించిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హతే లేదన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ అవహేళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు దళితుల ఓట్లు కావాల్సి వచ్చాయని... అందుకోసమే దళితులపై ప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి అన్నారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనపై జిల్లా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనపై మంత్రి ఆదిమూలపు సీరియస్ అయ్యారు. దళిత ప్రజలనే కాదు సొంత పార్టీ దళిత నాయకులను సైతం హేళన చేస్తూ చంద్రబాబు అవమానిస్తుంటారని మంత్రి అన్నారు.
ఇటీవల యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ ఎరిక్షన్ బాబును చంద్రబాబు ఘోరంగా అవమానించారని మంత్రి సురేష్ పేర్కొన్నారు. నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు యర్రగొండపాలెంలో టిడిపి పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ఏ చెట్టూ లేనిచోట ఆముదపు వృక్షమే గొప్పది అయినట్లు ఇక్కడ ఎరీక్షన్ బాబే టిడిపి మహావృక్షం అని అనలేదా? అని చంద్రబాబును నిలదీసారు.
Read More రూ. 150 కోట్ల ఖర్చుకు రెడీ, గన్నవరంలో దమ్మునోడే నిలుపుతాం: చింతమనేని సంచలనం
టిడిపిలో తీవ్ర అమవానాలు ఎదుర్కొంటూ కూడా దళిత నాయకులు అందులోనే ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. దళితులు ఏమీ పీకలేరంటూ చులకనగా మాట్లాడిన నాయకుడిని ఎదిరించకుండా ఎలా వుంటున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
టిడిపి అధికారంలోకి రాగానే మార్కాపురం జిల్లా ఏర్పాటుచేస్తానన్న చంద్రబాబుకు మంత్రి సురేష్ కౌంటరిచ్చారు. గతంలో అధికారంలో వున్నది మీరే కదా... అప్పుడెందుకు కొత్త జిల్లాల ఏర్పాటు గుర్తుకురాలేదంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్ల కోసం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అన్నారు.
మీరు చేయలేని పని జగనన్న చేసి చూపించారు... కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారన్నారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందన్నారు. ఎక్కడైనా జూనియర్ ఎన్టిఆర్ ఫ్లెక్సీలు కనబడితేనే చంద్రబాబు ఒప్పుకోడు... కానీ సభల్లో మాత్రం జై ఎన్టిఆర్ అని అంటాడని... రెండు నాలుకల ధోరణి ఆయనకే సాధ్యమంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
