ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రిని మేల్కొలిపేలా జనసేన పార్టీ #GoodMorningCMSir అనే పేరిట సోషల్ మీడియాలో డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు జనసేన నేతలు యత్నించారు. 

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు జనసేన నేతలు ప్రయత్నించడంతో శుక్రవారం గుడివాడలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పట్టణంలో అధ్వాన్నంగా వున్న రహదారులకు మరమ్మత్తులు చేయించాలంటూ జనసేన నేతలు కొడాలి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంట్లోకి దూసుకెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. 

కాగా... ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రిని మేల్కొలిపే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ ను జనసేన ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మరో వ్యంగ్య కార్టూన్ ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం 8 గం.కు పవన్ కళ్యాణ్ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి తెలుస్తోంది. ఈ వీడియోను పోస్టు చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు. 

ALso REad:ఆయనకు అది ఎన్నటికీ సాధ్యం కాదు.. పవన్‌పై మంత్రి రోజా సెటైర్లు

దీంతోపాటు రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్నిపవన్ కళ్యాణ్ గారు పోస్టు చేశారు. హెలికాప్టర్ లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఆ కార్టూన్ తెలియచేస్తుంది. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. జగనన్న ‘ఉయ్యాలా-జంపాలా’ పథకంలో భాగమే ఈ రోడ్లని సోషల్ మీడియా వేదికగా రోడ్ల దుస్థితిని షేరు షేస్తూ మీమ్స్, సెటైర్స్ వెల్లువెత్తుతుంటాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ దారుణంగా మారిపోయాయి. దీనిమీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా గురువారం కూడా ఓ కార్టూన్ కౌంటర్ ఇచ్చారు.