ఏపీ నూతన మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత పెంచింది.  అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు.. మావోయిల దాడిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకునేందుకు కిడారి కుమారుడు కిడారి శ్రవణ్ కి ఇటీవల సీఎం చంద్రబాబు.. మంత్రి పదవి అప్పగించారు.

కాగా.. ఇటీవల గిరిజన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రవణ్ కి కూడా మావోల నుంచి ప్రాణ గండం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రవణ్ వెంట ఉండే గన్ మెన్స్ తోపాటు అదనంగా ఆక్టోపస్ కమాండోల భద్రత కల్పించారు. నల్ల దుస్తులు ధరించిన కమాండోలు మంత్రి వాహనం వెంటన నిత్యం ఉంటారు.

దీంతో పాటు మంత్రి శ్రవణ్ వెంట ఎప్పుడూ నలుగురు గన్ మెన్స్ ఉంటారు. ప్రధానంగా సొంత జిల్లా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మంత్రి పర్యటన సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తారు. సూర్తి బులెట్ ఫ్రూఫ్ వాహనంతోపాటు మరో రెండు వాహనాల శ్రేణి మధ్య మంత్రి పర్యటించేలా ఏర్పాట్లు చేశారు.

మంత్రి శ్రవణ్ భద్రత వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్యురిటీ  అధికారిని కూడా ఏర్పాటు చేశారు. ఆయన నిత్యం కిడారి శ్రవణ్ వెంటే ఉంటారు.