కర్నూలు ఎంఎల్సీ: వైసిపిలో హై డ్రామా

First Published 26, Dec 2017, 10:35 AM IST
High drama going on in Kurnool mlc election over ycp
Highlights
  • కర్నూలు జిల్లా స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికపై హై డ్రామా నడుస్తోంది

కర్నూలు జిల్లా స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికపై హై డ్రామా నడుస్తోంది. పోటీ నుండి తప్పుకోవాలని జగన్ చేసిన ప్రకటనతో జిల్లా నేతలు విభేదిస్తున్నారు. పోటీలో ఉండాల్సిందే అంటూ పట్టుపడుతున్నారు. మంగళవారమే నామినేషన్ కు చివరి రోజు కావటంతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. కర్నూలు ఎంఎల్సీ ఎన్నికలో పోటీ చేయకూడదని సోమవారం సాయంత్రం వైసిపి అధ్యక్షుడి నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఏదేమైనా సరే పోటీ చేయాల్సిందేనంటూ జిల్లా నేత గౌరు వెంకటరెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఆ మేరకు జగన్ ను ఒప్పించేందుకు గౌరు గాండ్లపెంటకు చేరుకున్నారు.  పాదయాత్రలో ఉన్న జగన్ తో కొద్దిసేపటిలో భేటీ కానున్నారు. పోటీ లేకుండా టిడిపికి ఏకపక్షంగా సీటును వదిలేయటం ఏమాత్రం మంచిది కాదంటూ గౌరుతో పాటు మరికొందరు నేతలు భావిస్తున్నారు. జగన్ తో భేటీలో అదే విషయాన్ని చెప్పాలని కూడా అనుకున్నారు.

టిడిపి అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసనగా ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జగన్ నిర్ణయిచిన సంగతి అందరకి తెలిసిందే. మొన్నటి నంద్యాల ఉపఎన్నికను కైవసం చేసుకున్నట్లుగానే రేపటి ఎంఎల్సీ స్ధానంలో కూడా టిడిపి గెలవాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నట్లు వైసిపి ఆరోపిస్తోంది. అంతేకాకుండా గౌరు వెంకటరెడ్డికి స్వయానా బావైన టిడిపి నేత శివానందరెడ్డిని బరిలోకి దింపాలని యోచించింది. ఎందుకంటే, బావ-బావమరుదుల మధ్య కుటుంబంలో చిచ్చు పెట్టాలన్నది టిడిపి ఉద్దేశ్యంగా కనబడుతోంది. వైసిపి పోటీ నుండి తప్పుకోవాలని నిర్ణయించటానికి ఇది కూడా ఓ కారణం.

అయితే, ఎప్పుడైతే పొటీ నుండి తప్పుకుంటున్నట్లు వైసిపి ప్రకటించిందో వెంటనే టిడిపి స్పందించింది. తమ అభ్యర్ధిగా కెఇ ప్రభాకర్ ను అధికారికంగా ప్రకటించింది.. దాంతో వైసిపి ఖంగుతిన్నది. తామొకటనుకుంటే చంద్రబాబు ఇంకోలా వ్యవహరించటంతో వైసిపి నేతలకు మండిపోయింది. అదే విషయాన్ని సోమవారం రాత్రి వైసిపి నేతలు చర్చించుకున్నారు. పొద్దుటికల్లా సీన్ మారిపోయింది. గౌరు వెంకటరెడ్డితో పాటు కర్నూలు జిల్లా నేతల్లో కొందరు జగన్ తో భేటీ అయ్యేందుకు గాండ్లపెంటకు చేరుకున్నారు. సమావేశంలో ఏమవుతుందో చూడాలి.

 

loader