విశాఖ జిల్లా భీమిలిలో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమార్తెకు చెందిన భవనాన్ని కూల్చివేస్తామంటూ జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవీఎంసీ కమిషనర్‌ ఈ నెల 22వ తేదీన ఇచ్చిన నోటీసును సవాల్‌ చేస్తూ కంచర్ల రవీంద్రనాథ్‌, గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత హౌస్‌మోషన్‌(అత్యవసర) పిటిషన్‌ దాఖలు చేశారు. 

జీవీఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారంటూ పిటిషనర్లు అత్యవసరంగా అభ్యర్థించడంతో జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ శుక్రవారం తెల్లవారుజామున పిటిషన్‌పై విచారణ జరిపారు. జీవీఎంసీ కమిషనర్‌ ఇచ్చిన నోటీసులను ఈ నెల 27 వరకూ సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.