కోళ్ళ పందేలు లేకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను ఎవ్వరూ ఊహించలేరు.

కోడి పందేలు లేకుండానే ఈ సారి సంక్రాంతి పండుగ జరుపుకోవాలా? ఎందుకంటే, కోళ్ళ పందేలను న్యాయస్ధానం నిషేధించింది. పందేలు నిర్వహించాల్సిందేనని నిర్వాహకులు, కూడదని న్యాయస్ధానం. మరి ఎవరి మాట సాగుతుందో చూడాలి.

ఎందుకంటే, కోళ్ళ పందేలు లేకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను ఎవ్వరూ ఊహించలేరు. దశబ్దాల తరబడి కోళ్ళ పందేలన్నది ఓ సంప్రదాయంగా వస్తోంది.

గతంలో కూడా పందేలను నిషేధించాలని న్యాయస్ధానం, ప్రభుత్వం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎందుకంటే, పందేలు నిర్వహించేవారికి ఉన్న రాజకీయ బలం అటువంటిది. పార్టీలు ఏవైనా ఈ విషయంలో నేతలందరూ ఒకటే.

దానికితోడు పందేలు జరగకుండా చూడాల్సిన పోలీసులు కూడా నిర్వాహకుల్లో ఓ భాగమే. దాంతో ఆదేశాలు కాగితాలకు మాత్రమే పరిమితమౌతున్నాయి.

తాజాగా కోళ్ళ పందేలపై ఉమ్మడి హై కోర్టు సీరియస్ అయింది. పందేలు నిర్వహించటమంటే జంతు హింసేనని చెప్పింది. పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్, యానిమల్ వెల్ఫేర్ బోర్డు దాఖలు చేసిన పిటీషన్లపై కోర్టు స్పందించింది.

అయితే, పందేల కోసం వందలాది నిర్వాహకులు తమ కోళ్ళను ఏడాది నుండి శిక్షణ ఇప్పిస్తున్నారు. పందేల్లో పాల్గొనే కోళ్లపై శిక్షణ కోసమే నెలకు వేలాది రూపాయలు వ్యయం చేస్తారు. పందేల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాలనుండి కూడా ఎందరో వస్తారు.

కోళ్ళ పందేలకు రావాల్సిందిగా భీమవరంకు చెందిన కొందరు నిర్వాహకులు తెలంగాణా మంత్రి కెటిఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించటం గమనార్హం. పందేల నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు నిర్వాహకులు. అటువంటిది కోళ్ళ పందేలపై కోర్టు నిషేధం విధించటం ఆచరణ సాధ్యమేనా.