పల్నాడు జిల్లా మాచర్లలో ‌చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి నిందితులుగా ఉన్న టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో సహా 23 మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

పల్నాడు జిల్లా మాచర్లలో ‌చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి నిందితులుగా ఉన్న టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో సహా 23 మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో ఏ7గా కళ్లం రమణారెడ్డికి మాత్రం హైకోర్టు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయలేదు. మాచర్లలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు టీడీపీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని ఈ కేసులో ఏ1గా చేర్చారు. 

అయితే గత నెలలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు తమపై కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌ కోసం జూలకంటి బ్రహ్మానంద రెడ్డితోపాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదిస్తూ.. ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ సభ్యులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని చెప్పారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వై నాగిరెడ్డి వాదిస్తూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రహ్మానందరెడ్డికి నేర చరిత్ర ఉందన్నారు. అధికార పార్టీ సభ్యులపై పిటిషనర్లు దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. 

అయితే ఈ క్రమంలోనే ఏ కారణాలపై పిటిషనర్లపై హత్యాయత్నం వంటి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో వివరించాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు గత విచారణలో ఆదేశించింది. 

ఇక, పల్నాడు జిల్లా మాచర్లలో డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. ఇక, జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, టీడీపీ కార్యాలయం, పలు వాహనాలను వైసీపీ కార్యకర్తలను తగలపెట్టారని టీడీపీ ఆరోపించింది.