టిడిపికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుంది చూడబోతుంటే. ఒకవైపు కేంద్రం నుండి సమస్యలతో నానా అవస్తలు పడుతున్న చంద్రబాబుకు తాజాగా హై కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. కోడిపందేల నిర్వహణకు సంబంధించి ఇద్దరు టిడిపి ఎంఎల్ఏలతో పాటు మరో ఇద్దరు మాజీ ఎంఎల్ఏలపై వెంటనే కేసులు నమోదు చేయాలంటూ ఆదేశించటం గమనార్హం.

ఇంతకీ విషయం ఏమిటంటే, కోడిపందేలను నిర్వహించకూడదంటూ హై కోర్టు గతంలో ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులు చాలామంది కోళ్ళపందేలు నిర్వహించారు. పైగా పందేల నిర్వహణను ప్రారంభిస్తూ ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. అదే ఇపుడు వారికి పెద్ద షాక్ ఇస్తోంది.

ప్రజాప్రతినిధులపై వచ్చిన ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా వెంటనే ఎంఎల్ఏలు అనగాని సత్యప్రసాద్, ఎంఎల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పై తక్షణమే కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను హై కొర్టు ఆదేశించింది. వారితో పాటు మాజీ ఎంఎల్ఏలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకటసుబ్బయ్యలపైన కూడా కేసులు నమోదు చేయమని చెప్పింది. పై నలుగురిపై కేసులు పెట్టి చార్జిషీట్ వేయాలని కూడా స్పష్టంగా ఆదేశించింది. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తప్పవంటూ హై కోర్టు హెచ్చరించటం గమనార్హం.