వైసిపి నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో చంద్రబాబునాయుడు, కెఇ కృష్ణమూర్తిలకు ఒకేసారి కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. హత్య కేసుకు సంబంధించి హతుడి భార్య శ్రీదేవీరెడ్డి వేసిన పిటీషన్ పై కోర్టు బుధవారం విచారణ జరిపింది. తన భర్త హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబే ప్రదాన వ్యక్తిగా శ్రీదేవి పిటీషన్లో పేర్కొన్నారు. కెఇ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తికొండ నియోజకవర్గంలో కెఇ-చెరుకులపాడు ప్రత్యర్ధులన్న విషయం అందరికీ తెలిసిందే.

రేపటి ఎన్నికలకు చెరుకులపాడు రంగం సిద్దం చేసుకుంటున్న నేపధ్యంలో జరిగిన హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే, ప్రతిపక్షం ఒత్తిళ్లకు లొంగి ఏదో తూతుమంత్రంగా పోలీసులు కొందరిని అరెస్టు చేసారు.  హత్యకు కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబే అసలు సూత్రదారునిగా వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. హత్య పథకంలో అసలు సూత్రదారులను వదిలేయటమేంటంటూ నిలదీస్తున్నారు.  విషయమేమిటంటే పోలీసు రికార్డుల  ప్రకారం శ్యాంబాబు కనిపించటం లేదు. విచిత్రమేంటంటే, శ్యాంబాబు ప్రతీ కార్యక్రమానికి హాజరవుతూనే ఉన్నారు. దాంతో ఒళ్ళు మండిన వైసిపి నేతలు కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసే ఇపుడు విచారణకు వచ్చింది.

విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వెంటనే కెఇ శ్యాంబాబు మీద కేసు నమోదు చేయాలని చెప్పారు. అదేవిధంగా శ్యాంబాబును కేసులో నుండి  తప్పించిన వెల్దుర్తి ఎసై తులసీ నాగప్రసాద్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.