Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన హై కోర్టు...

వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుల నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోవాలని, హత్య కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకోవాలని న్యాయమూర్తి స్ఫష్టం చేశారు. 

High Court denies bail to three accused in Viveka murder case in andhrapradesh
Author
Hyderabad, First Published Aug 2, 2022, 7:53 AM IST

అమరావతి : మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వై. సునీల్ యాదవ్ (ఏ2), గజ్జల ఉమా శంకర్ రెడ్డి (ఏ3), దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి (ఏ5) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది.  దర్యాప్తు కొనసాగుతోందని, గతంలో వేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని పేర్కొంది. దిగు కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేయడాన్ని పరిస్థితుల్లో మార్పు చోటుచేసుకున్నట్లు పరిగణించలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ బెయిల్ పిటిషన్లను కొట్టి వేస్తూ సోమవారం కీలక తీర్పు ఇచ్చారు. 

వివేకా హత్య కేసులో నిందితులైన sunil yadav, ఉమా శంకర్ రెడ్డి, శివశంకర్ బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు.వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ… ‘దేవి రెడ్డి  శివ శంకర్ రెడ్డిది ఈ హత్య వ్యవహారంలో కీలక పాత్ర. పడకగదిలో రక్తాన్ని శుభ్రం చేయాలని పనిమనిషిని ఒత్తిడి చేశారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు కనిపించకుండా కాంపౌండర్ తో కట్లు కట్టించారు. పోస్టుమార్టం జరగకుండా తీవ్ర జాప్యం చేయించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. 

AP Rains: సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న చిత్రావతి..

శివ శంకర్ రెడ్డికి ఎలాంటి దురుద్దేశం లేకపోతే హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. తాత్కాలిక బెయిల్ పై వచ్చినప్పుడు సాక్షులను ప్రభావితం చేసేలా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజకీయ నేతలు ఆయనను కలిశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్రెడ్డి ముగ్గురు మిత్రులు. శివ శంకర్ రెడ్డి మీద మొత్తం 31కేసులు ఉన్నాయి.  ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు.

సిబిఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. ‘వివేకా హత్య కు శివశంకర్ రెడ్డి ప్రధాన సూత్రధారి. మృతదేహం వద్ద ఆధారాలను తుడి చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. వివేకా మృతదేహంపై గాయాలను ఫోటో తీస్తున్న హోంగార్డును బెదిరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సిఐ శంకరయ్య పై ఒత్తిడి తెచ్చారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు. సాక్షులను, అధికారులను బెదిరిస్తున్నారు. హత్య నేరాన్ని మీద వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని గంగాధర్ రెడ్డికి ఆశ చూపారు. కుట్ర కోణం తేల్చేందుకు సాక్ష్యాధారాలను నాశనం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ఈ దశలో బెయిల్ మంజూరు చేయవద్దు’ అని కోరారు.

సిబిఐ అభియోగపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు టి. నిరంజన్ రెడ్డి, కలిగినీడి చిదంబరం, టీఎల్ నయన్ కుమార్ వాదించారు. మొదటి దర్యాప్తు కొనసాగుతోంది అన్న కారణంతో పిటీషనర్లను కస్టడీలో ఉంచడం సరికాదన్నారు. ఏపీలో కాకుండా ఏ రాష్ట్రంలోనైనా ఉండాలన్న షరతుతో బెయిల్ ఇవ్వాలని కోరారు. బెయిల్ మంజూరు విషయంలో నిందితుల కస్టడీ కాలన్ని లెక్కలోకి తీసుకోవాలని ఉన్నప్పటికీ.. అదేసమయంలో నిందితుల నేర చరిత్ర, కేసు మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. 

వ్యక్తిగత స్వేచ్ఛ వెలకట్టలేని హక్కు అయినప్పటికీ.. బెయిల్ మంజూరు చేసేటప్పుడు నిందితులపై తీవ్రమైన ఆరోపణలు,  కేసు పూర్వాపరాలు, కోర్టు ముందున్న ఆధారాలను విస్మరించకూడదు. వివేకానంద రెడ్డి హత్య కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దిగువ న్యాయస్థానం, హైకోర్టు గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లను కొట్టి వేశాయి. ప్రస్తుత బెయిల్ పిటిషన్లను పరిగణనలోకి తీసుకునేందుకు తాజా కారణాలేమీ లేవు. ఈ నేపథ్యంలో మూడు బెయిల్ పిటిషన్లను కొట్టి వేస్తున్నాం... అని హైకోర్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios