ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారిన అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్ట్ ఆస్తుల్లో కీలకమైన హాయ్ లాండ్ ని అమ్మకానికి పెట్టాలని ఎస్‌బిఐని కోర్టు ఆదేశించింది. ఇంటర్నేషన్ లెవెల్లో బిడ్డర్లను పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇవాళ అగ్రిగోల్డ్ కేసు మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది.దీనిపై విచారణ  జరిపిన న్యాయస్ధానం హాయ్ లాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా ఖరారు చేసింది. ఈ ధరను  అనుసరించి హాయ్ లాండ్ ని వేలం వేయాలని ఎస్‌బిఐకి సూచించింది. బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8న సీల్డ్ కవర్ లో తమకు సమర్పించాలని ఎస్‌బిఐని ఆదేశించింది. 

ఇదే కేసు ఇవాళ మరో పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై ఇప్పటివరకు ఆసక్తి కనబర్చిన జీఎస్ఎల్ గ్రూప్ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆస్తుల కొనుగోలుపై వెనక్కి తగ్గుతూ జీఎస్ఎల్ గ్రూప్ హైకోర్టుకు విన్నవించుకుంది. గతంలో తాము చేసిన ప్రతిపాదన ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం జీఎస్ఎల్ గ్రూప్ కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే ఈ సంస్థ డిపాజిట్ చేసిన రూ.10కోట్లలో రూ.7 కోట్లు మాత్రమే వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. మిగతా 3 కోట్లను నష్టపరిహారం కింద జమచేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.