కర్నూలు: రాయలసీమ ఉద్యమకారుల డిమాండుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగి వచ్చినట్లే కనిపిస్తున్నారు. హైకోర్టును, రాజధానిని ఆంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం పట్ల రాయలసీమ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనలు మరింత ఎగిసిపడకుండా చంద్రబాబు జాగ్రత్తపడినట్లు కనిపిస్తున్నారు. 

చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కోస్గి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 

జలధార ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో 97 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన రెండు త్వరలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్ాచరు. కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి అమరావతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు విమాన సర్వీసులు ఉంటాయని చంద్రబాబు  తెలిపారు
 
త్వరలో ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్‌గా మారుతుందని ఆయన చెప్పారు. 200 ప్రముఖ కంపెనీలు ఓర్వకల్లుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గని అల్ట్రా మెగాపవర్‌ సోలార్ పార్కు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రాజెక్టు అని ఆయన చెప్పారు.  ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.