అడ్వకేట్ జనరల్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్ధానం ఎంఎల్ఏలకు నోటీసులు ఇవ్వాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపు శాసనసభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గడచిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 20 మంది అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. దాంతో పలు మార్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని వైసీపీ పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎంఎల్ఏ విశ్వేశ్వర్ రెడ్డి హై కోర్టులో ఓ పిటీఫన్ దాఖలు చేసారు.

 పిటీషన్ లోని విషయాన్ని లోతుగా పరిశీలించిన న్యాయస్ధానం ఫిరాయించిన 20 మంది ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వారందరూ సమాధానం ఇవ్వటానికి వీలుగా విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అంటే, ఈ నాలుగు వారాల్లోగానే ఫిరాయించిన శాసనసభ్యులందరూ న్యాయస్ధానానికి తమ సమాధానాలు అందచేయాలి.

వైసీపీ పిటీషన్ పై స్పందించిన అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఇదే విషయమై మాట్లాడుతూ, సుప్రింకోర్టులో విచారణ జరుగుతున్నందను హై కోర్టులు ఈ కేసు విచారణ అర్హం కాదంటూ వాదించారు. అయితే, అడ్వకేట్ జనరల్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్ధానం ఎంఎల్ఏలకు నోటీసులు ఇవ్వాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. మరోవైపు ఇటువంటి కేసుపైనే తెలంగాణాలోని కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్ కూడా అధికార తెలంగాణా రాష్ట్ర సమితిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై సుప్రింకోర్టులో పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.