బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ తీవ్ర తుపానుగా మారుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను కారణంగా ఆకాశం మేఘావృతమవ్వడంతో పాటు జిల్లా వ్యాప్తంగా చల్లటి గాలులు వీస్తున్నాయి.

భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో తీరం వెంబడి అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తుపాను బలపడే సమయంలో గాలుల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read:సూపర్ సైక్లోన్ గా ఆంఫన్... ఇక ఆ రాష్ట్రాల్లో కుంభవృష్టే: వాతావరణ శాఖ హెచ్చరిక

ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో మత్స్యకారులు ఎవరూ సముద్రంవైపు వెళ్లొద్దని సూచించింది. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు పర్యటించిమత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఒడ్డున ఉన్న పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. 

మరోవైపు సూపర్ సైక్లోన్ ఉమ్ పెన్ కొద్దిగా బలహీనమైందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 480 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీవ్రత తగ్గినప్పటికీ గాలి బీభత్సం మాత్రం తప్పదని శాస్త్రవేత్తలు చెబున్నారు.

Also Read:దూసుకొస్తున్న ''యాంపిన్'' తుఫాను... ఏపికి పొంచివున్న ప్రమాదం

సముద్రంలో లంగర్ వేసిన బోట్లు అలలు ఉద్ధృతికి తిరగబడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలుల ప్రభావంతో ఎత్తైన చెట్లు, స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ముఖ్యంగా ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఉమ్ పెన్ నేపథ్యంలో రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. తుపాను వచ్చే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.