విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపిన నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఏపీలో హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని రాష్ట్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల నివాసాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించింది. 

 ఆదివారం ఉదయం మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. డుంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్టు దగ్గర బస్సులో వెళ్తుండగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. కిడారికి అతి సమీపం నుంచే మావోయిస్టులు బెల్లెట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. 

ఈ దాడిలో ఎమ్మెల్యే ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ కాల్పుల్లో సర్వేశ్వరరావుతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
గత కొంతకాలంగా స్థబ్ధుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా దాడిలకు పాల్పడటంతో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ సూచించింది.    
 
గతంలో మావోయిస్టులు పలుమార్లు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావును హెచ్చరిస్తూ పోస్టర్లు కూడా వెలిసినట్లు తెలుస్తోంది. అయితే ఏజెన్సీలో ఎలాంటి అలజడి లేకపోవడంతో లైట్ తీసుకున్న ఎమ్మెల్యే గ్రామదర్శిని కార్యక్రమానికి బయలు దేరారు. అప్పటికే ఎమ్మెల్యేను హతమార్చేందుకు మాటువేసిన మావోలు దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడిలో దాదాపు 50మంది మావోలు పాల్గొన్నట్లు సమాచారం. దాడిలో పాల్గొంది 40 మంది మహిళా మావోయిస్టులు ఉండటంతో మహిళా మావోల దళం దాడులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ