విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం ఘటనపై తెలుగు సినీ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆ ప్రమాద ఘటనపై వ్యాఖ్యానించారు. స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చక ముందు ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. 

అప్పుడే అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించేవాళ్లని ఆయన ప్రశ్నించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఫైర్+ ఫీజు = ఫూల్స్ అనే ట్వీట్ కూడా చేశారు. అందరినీ ఫూల్స్ చేయడానికి విషయాన్ని అగ్ని ప్రమాదం నుంచి ఫీజుల వైపు మళ్లిస్తున్నారా అని ఆయన అడిగారు. 

 

యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ నేరుగా బిల్లింగ్ చేసిందని ఆయన చెప్పారు దాని వెనక పెద్ద కుట్ర జరుగుతున్నట్లుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తప్పుగా చూపించడానికి అలా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

"మీ కింద పనిచేసే కొంత మంది మీకు తెలియకుండా చేసే పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజీ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం" అని రామ్ పోతినేని జగన్ ను ఉద్దేశించి అన్నారు.